Kandireega Movie review - Ram, Hansika, Aksha


రామ్, హన్సిక, అక్ష నాయకానాయికలుగా, శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం "కందిరీగ". ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది.

ఒక హుషారైన కుర్రాడు తన తెలివితేటలను ఉపయోగించి తనకెదురైన అడ్డంకులను అధిగమించి ఎలా తన ప్రేమను గెలిపించుకున్నాడన్నదే ఈ చిత్ర కథ.

ఇది ఒక ఫక్తు కమర్షియల్ చిత్రం. కొత్తదనమనేది ఇసుమంతైనా లేకుండా ఉన్నప్పటికీ...రెండున్నర గంటలు హాయిగా నవ్వుకొనే చిత్రం. ప్రతీ సీన్ కూడా ఎక్కడో చూసినట్టూ....ముందే ఊహించేటట్టు ఉన్నప్పటికీ...కొన్ని ట్విస్ట్ లు మాత్రం బాగా పేలాయి.

ఇదివరకు రామ్ నటించిన రెడీ చిత్ర పోలికలు...ఆ హడావిడి ఈ చిత్ర ద్వితీయార్ధంలో లో కనపడతాయి.....రామ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అయోమయానికి గురిచేస్తూ తన ప్రేమను గెలిపించుకోవటం...

నూతన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఫస్ట్ హాఫ్ చాలా విసుగు తెప్పించాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే కూడా చాలా బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. అయితే రామ్ చేసిన ఫైట్స్, డాన్స్ ఈ చిత్రానికి బి,సి సెంటర్స్ లో మంచి స్పందన తీసుకురావడం ఖాయం. రామ్ తర్వాత చెప్పుకోవలసింది ప్రతినాయకుడిగా నటించిన సోనూసూద్ గురించి. అప్పుడప్పుడు నత్తి వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి.

ఇంటర్వెల్ తర్వాత దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అన్ని విభాగాల్లోనూ తన ప్రతిభను చూపించాడు.
చిత్రం సెకండాఫ్ లో ఉన్న చాలా పెద్ద తారాగణాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటూ ఎటువంటి అయోమయానికీ గురికాకుండా కథను నడిపించటంలో దర్శకుడు సఫలీకృతుడయాడు. ముఖ్యంగా సోనూసూద్, అక్ష ల మధ్య ప్రేమ సన్నివేశాలకి ధియేటర్ లో మంచి స్పందన వస్తుంది.

రాజేంద్ర కుమార్ వ్రాసిన తెలంగాణా యాసతో కూడిన డైలాగులకు ధియేటర్లో వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు.దానికి ఇంకో కారణం ఆ డైలాగులు ఏ విలన్ వో , కమెడియన్ వో అయితే విశేషం ఏమీ లేదు. ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా నటించిన అక్ష చెప్పే డైలాగ్స్. మొత్తంగా రాజేంద్ర కుమార్ మాటలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే...

రామ్ ఎప్పటిలానే హుషారైన నటనతో పాటు....డాన్స్, ఫైట్స్ లోనూ తన సత్తా చాటాడు. తనకి కొత్తగా చేయడానికి ఏమీ లేదు ఈ సినిమాలో. ఎప్పటిలానే....విలన్ గ్రూప్ ని బకరాలను చేసి ఆడుకునే క్యారెక్టరే కాబట్టి నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను రామ్ గురించి.

ఇక హీరోయిన్ హన్సిక....ఈ అమ్మాయి మొదటి సినిమా దేశముదురు... ఆ రోజుల్లో కేవలం హన్సికను చూడటానికి రెండు, మూడు సార్లు చూసిన ప్రేక్షకులున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆ తర్వాత తమిళ పరిశ్రమకి వెళ్ళిపోయింది. అక్కడ అరవం సాంబారు బాగా లాగించిందో ఏమో గానీ....వామ్మో...కందిరీగ లో ఉన్న హన్సిక రామ్ కి డబుల్ అయిపోయింది.

ఈ సినిమాకి తను మైనస్ పాయింట్. రామ్ తో మస్కాలో నటించిన హన్సికకు, ఈ చిత్రంలో ఉన్న హన్సికకూ పోలిక లేకుండా ఉంది. మొత్తానికి రామ్ ప్రక్కన ఈ చిత్రం లో చాలా ఎబ్బెట్టుగా కనిపించింది. గ్లామర్ మొత్తం పోయి నమితలా తయారయ్యింది. నటన పరంగా మామూలే.

అక్ష....సెకండ్ హీరోయిన్ అయినా ఎక్కువ నిడివి ఉన్న పాత్రే. తన తెలంగాణా డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక జయప్రకాష్ రెడ్డి, చంద్రమోహన్, శ్రీనివాస రెడ్డి, ఎం.ఎస్.నారాయణ తదితరులంతా మామూలే.

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్. అసలు ఈ సారుకి పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు ఎలా వస్తున్నాయో అర్దం కావట్లేదు. ఆ డప్పుల దరువేంటో.....ఆ గోలేంటో....పాట ఒక్క ముక్కా అర్దం కాదు. ఈ సినిమాలో కూడా అంతే. ఒక్క పాట అర్దం అయ్యేట్టు ఉంది. పోనీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా బాగుంటుందా అంటే అదీ అంతే. థమన్ సారూ...మా మీద దయఉంచి ఆ డప్పుల దరువు ఆపెయ్యండి సారు.

సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగానే ఉన్నాయి.

చివరగా.....

పక్కా కమర్షియల్ సినిమా. కుటుంబసమేతంగా వెళ్ళి చూడదగ్గ చిత్రమే. అంతే కాకుండా మాస్ ప్రేక్షకులు ఇష్టపడే అన్ని అంశాలూ ఉన్నాయి. కాబట్టి కాంచనతో హిట్ కొట్టిన బెల్లంకొండ సురేష్ కి ఈ సినిమా కూడా కాసుల పంట కురిపిస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

0 comments:

Post a Comment