Nanna Movie review



మానసిక ఎదుగుదల లేని ఒక తండ్రికి, అతని అయిదేళ్ళ కూతురికి మధ్య ఉండే భావోద్వేగాల సమాహారమే ఈ చిత్రం.
విక్రం, అనుష్క, బేబి సారా, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం విడుదలైంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే......
విక్రం... మానసిక వికలాంగుడిలా మరోసారి తన నట విశ్వరూపాన్నిచూపించాడు. శివపుత్రుడు తర్వాత ఆ స్థాయి నటనను ప్రదర్శించాడు ఈ చిత్రంలో. తన నడక, చూపు, మాట.... ఇలా అన్నింట్లో విక్రం చూపించిన వైవిధ్యానికి ముగ్ధుడవని ప్రేక్షకుడు ఉండడు.
విక్రం తర్వాత చెప్పుకోవలసింది బేబి సారా గురించి. ఐదేళ్ళ ఆ పాప విక్రంకు కూతురిగా నటించింది. ఆ పాప నటన ఈ చిత్రానికే హైలెట్. సారా ముగ్దమనోహర రూపం, ఆ నవ్వు అన్నిటికీ మించి కళ్ళతో భావాలు పలికించే తీరు చూస్తున్న ప్రేక్షకులను కళ్ళు ప్రక్కకు తిప్పుకోనివ్వకుండా చేసింది. విక్రంకు సమాన స్థాయిలో నటనను ప్రదర్శించిందని చెప్పటానికి నేను సందేహించను.

ఇక నా అభిమాన తార అనుష్క...మరోసారి నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించి మెప్పించింది. గ్లామర్ పాత్రలకే కాదు...పెర్ఫామెన్స్ పాత్రలకు కూడా న్యాయం చేయగలనని మరోసారి నిరూపించింది అనుష్క. "వెలిగినదొక వానవిల్లు" పాటలో అనుష్క వస్త్రధారణ, తన అందమైన రూపం చూస్తూనే ఉండాలనిపించేలా
ఉన్నాయి. అనుష్కది గ్లామర్ పాత్ర కాకపోయినా, తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అమలాపాల్ కూడా చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి కళ్ళు తనకి ప్లస్. క్లోజ్-అప్ షాట్స్ లో చాలా బాగుంది.

ఇక నాజర్, సాంథను, సురేఖావాణి తదితరులు వాళ్ళ పాత్రల పరిధులమేరకు బాగానే నటించారు.

ఇక సాంకేతికవర్గానికి వస్తే........
దర్శకుడు విజయ్.....అతని ప్రతిభ సినిమా ప్రతీ ఫ్రేం లోనూ కనబడుతుంది. సెంటిమెంటును, వినోదాన్నీ సమపాళ్ళలో నడిపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. బేబీ సారా నుంచి అంత మంచి నటనను రాబట్టుకోవడం లో విజయ్ సఫలీకృతుడయ్యాడు. చాలా దృశ్యాలలో కంటతడి పెట్టించాడు. తండ్రీకూతుళ్ళ మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని, ఉద్వేగభరితమైన సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించాడు. ఆ సన్నివేశాలకు ధియేటర్స్ లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.

సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ అత్యద్భుతమైన నేపధ్యసంగీతాన్ని(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) అందించాడు. ఈ కుర్రాడు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడు.

సినిమాటోగ్రఫీ నిరవ్ షా.....ఆయన పనితనం గురించి తెలియాలంటే ఈ చిత్రంలో "వెలిగినదొక వానవిల్లు" పాట ఒక్కటి చాలు. ఆ పాటలో చీకటి వెలుగులో వాన చినుకులను, అనుష్క ముందు రంగులు వేసే దృశ్యాలను కెమేరాలో బంధించి తెరపై ప్రేక్షకులకు హరివిల్లునే చూపించాడు నిరవ్ షా.

చివరగా....కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. కుటుంబసమేతంగా చూసే చిత్రం.


Tags: Nanna, Deiva Thirumagan, Anushka, Vikram, Nanna Movie, Baby Sara, Amala Paul, movie review, A.L.Vijay

0 comments:

Post a Comment