Ishq Movie Review - Nitin, Nitya Menon


ఇప్పటి వరకు నేను హీరో కోసమో,హీరోయిన్ కోసమో, డైరెక్టర్ కోసమో, కొన్నిసార్లు బ్యానర్ పేరు చూసి కూడా వెళ్ళాను. కానీ మొట్ట మొదటసారి కెమేరామెన్ పేరు చూసి సినిమాకి వెళ్ళాను. ఆ కెమేరామెన్ పి.సి.శ్రీరాం. ఆ సినిమా ఇష్క్. నితిన్, నిత్యామీనన్ నటించగా, విక్రం కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విక్రం గౌడ్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.
కథ విషయానికి వస్తే...ప్రేమించిన అమ్మయి ని పెళ్ళి చేసుకోవడానికి తనకి ఎదురైన కష్టాలని అనువుగా మార్చుకొని తన ప్రేమను గెలిపించుకొనే ఒక ప్రేమికుని కథ.
ఆకలితో పస్తులున్న వాడికి, పంచభక్ష్య పరమాన్నాలు దొరికితే ఎలా ఉంటుందో, ఒక మంచి సినిమా చూడటం కోసం ఎదురుచూస్తున్న నాకు ఈ సినిమా చూసాక అదే అనుభూతి కలిగింది. వెళ్ళింది పి.సి.శ్రీరాం ఫోటోగ్రఫీ కోసమే అయినా, ఈ చిత్ర కథ, కథనం(స్క్రీన్ ప్లే), నేపథ్య సంగీతం(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) నన్ను ఆద్యంతం కట్టిపడేశాయి. డైరెక్టర్ విక్రం.కె.కుమార్ తెలుగులో శ్రీయ మొదటి సినిమా ఇష్టం తీశాడు. తర్వాత హిందీలో 13బి లాంటి సినిమాలు తీసి మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చాడీ సినిమాతో. సాధారణ ప్రేమకథే అయినప్పటికీ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో కథ ని నడిపించిన తీరు ప్రేక్షకులని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. నితిన్, నిత్యామీనన్ ల క్యారెక్టర్లతో పాటు చెప్పుకోవలసిన మరొక పాత్ర అజయ్ ది.

అజయ్ పాత్రని మలచిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా విక్రం కే చెందుతుంది. నటీనటులను కావలసిన మేరకు ఉపయోగించుకున్నాడు. కావలసిన నటనను రాబట్టుకున్నాడు. మొత్తంగా డైరెక్టర్ గా సూపర్ సక్సెస్స్ అయ్యాడు విక్రం.

ఇక నటీనటుల విషయానికి వస్తే -

నితిన్....ఇదివరకు ఎప్పుడు హిట్ వచ్చిందో మర్చిపోయాడు నితిన్. ఎప్పట్లాగానే మంచి ఎనెర్జిటిక్ గా నటించాడు నితిన్. కొత్త హెయిర్ స్టైల్ తో....మంచి కాస్ట్యూంస్ తో...చాలా అందంగా కనిపించాడు నితిన్.

నిత్యామీనన్.....అందంతో పాటు సహజంగా నటించే మంచి నటి. ఈ సినిమాకి నిత్య ప్లస్ అయ్యిందనడంలో సందేహం లేదు.

తర్వాత చెప్పాల్సింది అజయ్ గురించి. విలన్ క్యారెక్టర్స్ లేదా హీరో కి ఫ్రెండ్ క్యారెక్టర్స్ వేసే అజయ్ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ చిత్రం లొ కనిపిస్తాడు.విలనిజం తో పాటు...చెల్లెలిని ప్రేమగా చూసుకునే అన్నగా, మంచివాడుగా మారిన కొడుకుగా, భాధ్యత గల భర్తగా నటించి ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇది అతని కెరీర్ లో ఒక మంచి పాత్రగా మిగిలిపోతుంది.

ఇక...నాగినీడు,సుధ,సింధూ తొలాని మొదలయిన వాళ్ళంతా వాళ్ళ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు.


ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే........

పి.సి.శ్రీరాం.....గీతాంజలి, ఘర్షణ(), నాయకుడు, ఖుషి లాంటి చరిత్ర సృష్టించిన చిత్రాలకు పని చేసిన కెమేరామెన్ ఆయన. ఒక చక్కని ప్రేమకథని హృద్యంగా తెరకెక్కించాలంటే, మంచి కథ తో పాటు కావల్సినవి రెండు.ఒకటి ఫొటోగ్రఫీ, రెండు సంగీతం. కథ నచ్చితేనే సినిమా ఒప్పుకునే పి.సి.శ్రీరాం...ఆ కథని తెరకెక్కించే దర్శకుడి హృదయాన్ని మరింత అందగా తెరమీద ఆవిష్కరిస్తారు. ఈ సినిమాలో ఆయన పనితనం, ఆయన మార్క్ ప్రతీ ఫ్రేం లోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా గోవా ఎపిసోడ్ లో ఆయన వాడిన లైటింగ్స్,క్లోజ్-అప్ షాట్స్ అద్భుతం.
ఎడిటర్ శ్రీకర ప్రసాద్....ఎడిటింగ్ బాగుంది. ఎక్కువ నిడివి ఉన్నప్పటికీ ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు లేవు.మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్....ప్రేమకావాలి చిత్రం తో ఫాంలోకి వచ్చిన అనూప్ తెలుగు లో మంచి భవిష్యత్తు ఉన్న సంగీతదర్శకుడు. ఒక మంచి ప్రేమకథకి కావల్సిన నేపధ్యసంగీతంతో పాటు చక్కని పాటలు కంపోజ్ చేసాడు. తెలుగులో దూకుడు మీదున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేసే పాటల్లో...లిరిక్ స్టార్ట్ అయ్యిందో లేదో తెలియకుండా వాయిద్యాల హోరు లో సాహిత్యం కొట్టుకుపోయే పరిస్థితి. కాని అనూప్ పాటల్లో వినసొంపైన మ్యూజిక్ తో పాటు లిరిక్ కూడా చక్కగా వినిపిస్తుంది. లచ్చమ్మ, సూటిగా చూడకు, చినదానా పాటలు చక్కని బాణీలతో పాటు పి.సి.శ్రీరాం కెమేరా కూడా తోడు కావడంతో ప్రేక్షకులకి కనులవిందు...వీనులవిందు.చివరగా...రెండున్నర గంటలు హాయిగా నవ్వుకుని, సినిమా ముందు ఏవన్నాబాధలుంటే సినిమా చూసాకా వాటిని మర్చిపోతారు. నేను హామీ.

0 comments:

Post a Comment